Barrelakka : తెలంగాణ ఎన్నికల సమయంలో బర్రెలక్కపేరు ఎంత మారుమ్రోగిందో మనం చూశాం. నిరుద్యోగుల ప్రతినిధిగా ఎన్నికల బరిలోకి దిగి సెన్సేషన్ సృష్టించిన బర్రెలక్క ఆదివారం వెలువడిని రిజల్ట్స్‌లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన బర్రెలక్కకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి విదేశాల నుండి కూడా బర్రెలక్కకు ప్రజల నుండి విశేషమైన మద్దతు లభించింది.. మొదటి సారిగా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఒక మహిళగా పోటీలో నిలబడ్డారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా తన మార్క్ ను చూపించింది. విజిల్ గుర్తుతో తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీషకు మొత్తం 5598 ఓట్లు వచ్చాయి.
బర్రెలక్క తమకు పోటీ కాదు.. కేవలం ఆమెకుసోషల్ మీడియాలోనే ఫాలోవర్స్ ఉన్నారు.. రియాల్టీలో లేరు అని కొల్లాపూర్ లోని ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలిచిన జూపల్లి , హర్షవర్దన్ రెడ్డి ఎన్నో సార్లు అన్నారు. కానీ.. అమెకు ప్రభుత్వ వ్యతిరేఖ ఓట్లతో పాటు.. నిరుద్యోగుల ఓట్లు కూడా బాగానే పడ్డాయి. దీంతో ఈమె రాబోయే ఎన్నికల్లో నిలిచే యువతకు ఎంతో స్పూర్తిదాయకంగా నిలిచిందనే చెప్పాలి. తన ఓటమిపై మాట్లాడిన బర్రెలక్క తాను ఒక సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించింది . అసెంబ్లీ ఎన్నికలలో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా, మద్యానికి లొంగకుండా తనకు ఓట్లు వేసిన వారికి తాను ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొంది.
నమ్మి ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగానని స్వతంత్రంగా పోటీ చేసి 6000 ఓట్ల వరకు సాధించటం తన నైతిక విజయం అని వెల్లడించింది. అంతేకాదు 2024లో రానున్న ఎన్నికలలో పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతానని బర్రెలక్క సంచలన ప్రకటన చేసింది. మరోమారు ఏకంగా పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగుతానని చెప్తున్న బర్రెలక్కను ఓటర్లు ఆదరిస్తారా? ఈసారి బర్రెలక్క పోటీకి ఇంత క్రేజ్ ఉంటుందా? అనేది వేచి చూడాల్సింది.