Bandla Ganesh : కాంగ్రెస్ నాయకులు కన్న కల నెరవేరింది. ఎంతో మంది కార్తకర్తలు, నాయకులు ఎప్పటి నుండో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకున్నారు. అయితే తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దీంతో ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే రేవంత్ రెడ్డి సీఎం అవ్వడంపై బండ్ల గణేష్ చాలా ఆనందం వ్యక్తం చేశాడు. అయితే రేవంత్ ప్రమాణ స్వీకారానికి ముందు తాను చెప్పినట్లుగానే తాను 200 పర్సెంట్ ఈ రోజు రాత్రికి ఎల్బీ స్టేడియంలోనే నిద్రపోతానంటున్నారు బండ్ల గణేష్. అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ.. పనులు చేయడానికి టైం పడుతుందని అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ విషయం తనకు ముందే తెలుసని.. తనకేం పదవి అక్కర్లేదని చెప్పారు.
గ్రౌండ్ లెవల్లో పనిచేసిన ఎమ్మెల్యేలకు కూడా నమ్మకంలేని వేళ.. మీరు అంత కచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎం అవుతారని ఎలా అంచనా వేయగలిగారని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. బండ్ల గణేష్ బదులిస్తూ.. ‘రేవంత్ రెడ్డి పోరాటం, ఆయన పడిన కష్టం, ఆయన మాట్లాడిన తీరు, జనంలోకి చొచ్చుకెళ్లిన విధానం చూసే.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రేవంత్ రెడ్డి సీఎం అవుతారని చెప్పా’ అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇకపై మీరు యాక్టివ్‌గా మారే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. తానెప్పుడూ కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగానే ఉన్నానని, ఇప్పటివరకు ప్రతిపక్షంలో ఉన్నందువల్ల ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉన్నానని బండ్ల గణేష్ చెప్పారు.
‘నేను జంప్ జిలానీని కాదు. 2004 నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నాను. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నాను. నేను కాంగ్రెస్ వాదిని అనేది ప్రపంచానికి తెలిసిన నిజం. రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లోనే ఉన్నాను. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండటం వల్ల.. నా పని నేను చేసుకుంటూ, ఎంత వరకు ఉండాలో, అంత వరకే ఉన్నాను. మా పార్టీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉంది’ అని బండ్ల గణేష్ అన్నారు.కాంగ్రెస్ పాలన బ్రహ్మాండంగా ఉంటుందని, రేవంత్ నాయకత్వంలో పార్టీ బ్రహ్మాండంగా పనిచేస్తుందని.. అందులో సందేహమే అవసరం లేదని బండ్ల గణేష్ చెప్పారు. ఎన్నికల ముందు చెప్పినట్లు 6 గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు.