Balakrishna : తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు ఏ ఒక్క నటుడికి కూడా జాతీయ స్థాయి అవార్డ్ దక్కకపోగా , తొలిసారి పుష్ప సినిమాతో నేషనల్ అవార్డ్ దక్కించుకున్నాడు.ఇప్పుడు బన్నీకి అవార్డ్ దక్కడం పట్ల ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 69 ఏండ్లలో ఇప్పటివరకు తెలుగు హీరోలెవరూ సాధించని అరుదైన రికార్డును బన్నీ సాధించిన నేపథ్యంలో ఐకాన్ స్టార్‌కు ఇండస్ట్రీ ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ కూడా స్పందించారు.
జాతీయ స్థాయిలో తెలుగు చిత్రాలకు అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు సినిమా సత్తా ప్రపంచ స్థాయిలో వెలిగిపోతుందని పేర్కొన్నారు. 69 ఏళ్లలో మొట్టమొదటిసారి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సోదరుడు అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడం నటుడిగా తనకు చాలా గర్వంగా ఉందని అన్నారు. తెలుగు చలనచిత్ర రంగానికే ఇదొక గర్వకారణం అని పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి ఆరు అవార్డులు వచ్చాయని.. ఆ చిత్రం ఇక్కడే కాకుండా, ఆస్కార్ స్థాయిలో సత్తా చాటిందని గుర్తుచేశారు. ఉప్పెన సినిమాకు కూడా అవార్డు రావడం సంతోషంగా ఉందని.. వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నట్టుగా చెప్పారు.
తెలుగు చిత్రపరిశ్రమ సత్తా అందరికి తెలిసి వచ్చిందని , రానున్న రోజులలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ మంచి మంచి సినిమాలు తీస్తుందని అన్నారు. ఒక్కప్పుడు కొన్ని భాషలకే అవార్డులు పరిమితం అయ్యాయని అన్నారు. అలాంటి అవార్డులను తెలుగు చిత్ర పరిశ్రమ కైవసం చేసుకోవడం గర్వకారణంగా ఉందని బాలయ్య తెలియజేశారు. అన్ని భాషాల వారు తెలుగు సినిమాలను ఆదరిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెబుతున్నట్టుగా చెప్పారు. అదే సమయంలో నంది అవార్డుల గురించి ప్రశ్నించగా.. ఆయన చిరునవ్వు నవ్వారు. బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి చిత్రంలో నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.