Balakrishna : ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు వైసీపీ నాయకులకి వణుకు పుట్టిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేతలు పలు ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. హిందూపురం నియోజక వర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండవ రోజు పర్యటించారు. బాలయ్యను చూసేందుకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చి జై బాలయ్య నినాదాలు చేశారు. అనంతరం బాలయ్య హిందూపురం టీడీపీ- జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే వైసీపికి వ్యతిరేకంగా టీడీపీ-జనసేన కార్యాచరణపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని ఇద్దరమూ రాజకీయాల్లోకి వచ్చామని చెప్పిన బాలయ్య… టీడీపీ, జనసేన కలయిక రాష్ట్రంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్నీ అన్నీ అని కాకుండా మొత్తం అన్ని స్థానాలను గెలుచుకోవాలని కోరకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. నేరస్తులు, హంతకుల పాలనతో ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని కూడా ఆయన తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.
రాష్ట్రంలో ఎక్కడ ఒక పని కూడా జరగట్లేదన్నారు. హిందూపురంలో తన సొంత నిధులు, పార్టీ నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు బాలయ్య తెలిపారు. ఏపీ అభివృద్ధి కోసం రెండు పార్టీలు టీడీపీ, జనసేన కలిసికట్టుగా పనిచేస్తాయని బాలయ్య వెల్లడించారు. టీడీపీ- జనసేన కలవడం ఒక కీలకమైన ఘట్టమన్నారు. నాడు ఎన్టీ రామారావు కూడా గతంలో పార్టీలన్నీ ఏకం చేసి అన్యాయంపై తిరుగుబాటు చేసారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ జై టీడీపీ, జై జనసేన నినాదాలు చేశారు. పవన్ కళ్యాణ్ యజ్ఞంలో సమిధ కావడానికి ముందుకొచ్చారని, జనసేన, టీడీపీ కలయిక కొత్త శకానికి నాంది పలికినట్టేనని బాలకృష్ణ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కూ, తనకూ ఎంతో సారూప్య కథ ఉందని, ఇద్దరం ఏది అయిన ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతామన్నారు. తాము ఎవరికీ భయపడబోమన్నారు. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. రాష్ట్రంలో పరిపాలన ఇష్టారాజ్యంగా జరుగుతుందని, వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయని బాలకృష్ణ విమర్శించారు.