Balakrishna : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా ‘యువగళం-నవశకం’ పేరుతో టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. పాదయాత్రకు ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించినా విజయవంతంగా పూర్తి చేశారని కొనియాడారు బాలకృష్ణ. విజయనగరంలో నిర్వహించిన నవశకం బహిరంగసభలో భాగంగా.. టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జనసేనాధిపతి పవన్ కళ్యాణ్‌కు ఓ పిలుపు ఇచ్చారు. ‘‘తమ్ముడు పవన్ కళ్యాణ్.. ఇక తెగిద్దాం’’ అంటూ పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోటీ చేద్దామని కోరారు. తనకు, పవన్ కళ్యాణ్‌కు కొన్ని సారూప్యతలు ఉన్నాయని.. తామిద్దరం ముక్కుసూటి మనుషులమేనని అన్నారు.
ఏదేమైనా కుండబద్దలయ్యేటట్టు మాట్లాడే స్వభావం తామిద్దరిది అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ తన జీవితాన్ని సినిమాలకే కాకుండా ప్రజాసమస్యలపై పోరాటానికి అధికంగా కేటాయిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని అనేక సమస్యలపై పవన్ తిరుగులేని పోరాటం చేశారన్నారు. ఇకపై తాము ఎంతకైనా తెగిస్తామని తేల్చి చెప్పారు.ఇది యువగళం పాదయాత్ర ముగింపు సభ కాదని, వైసీపీ అంతిమ యాత్రకు ఆరంభ సభ అని కుండబద్దలయ్యేలా చెప్పారు. వైసీపీ పాలనలో రాష్ట్ర యువత తమకు జరిగిన అన్యాయం, ఇబ్బందులను గుర్తుపెట్టుకోవాలని సూచించారు. 1982లో ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపునకు కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా విశేష స్పందన వచ్చిందని.. అదే విధంగా నేడు యువగళం పాదయాత్రకు గొప్ప స్పందన లభించిందని అన్నారు.
యువనేతపై ఈగ వాలకుండా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కాపాడుకుంటూ వచ్చారు.. వాళ్లందరికీ ధన్యవాదాలని తెలిపారు. చంద్రబాబు తన విజన్‌తో ఐటీ, డ్వాక్రాను తీసుకొచ్చారని.. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను చంద్రబాబు కొనసాగించి, పేదలకు అండగా నిలిచారని చెప్పారు. ప్రపంచదేశాలకు చంద్రబాబు తన విజన్‌ను పరిచయం చేశారన్నారు. అయితే ఈ సభకు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు బాలయ్య స్వయంగా వెళ్లి రిసీవ్ చేసుకున్నారు. అతనికి హగ్ ఇచ్చి ఆప్యాయంగా స్వాగతించారు. ఆ మధ్య అన్‌స్టాపబుల్ షోలోను వీరిద్దరి మధ్య మంచి బంధం కనిపించడం మనం చూశాం.