Balakrishna : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నట విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారవు జయంతి సందర్భంగా తెలుగుదేశం నేతలు, సినీ అభిమానులు, నివాళి అర్పించారు. రాష్ట్రానికి, తెలుగు చిత్ర సీమకు ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకుంటున్నారు. సంక్షేమ సారథిగా ప్రజల గండెల్లో నేటికీ చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. ఆయనతోపాటు సోదరుడు రామకృష్ణ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ…”టీడీపీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ నందమూరి తారకరామారావు అంటే ఓ వ్యక్తి కాదు శక్తి . సినిమాల్లో రారాజుగా ఉన్నప్పుడే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు అని అన్నారు.
అంత కన్నా ముందు ఘాట్‌ను జూనియర్ ఎన్టీఆర్ సందర్శించి తాతకు నివాళి అర్పించారు. ఆయనతోపాటు కల్యాణ్ రామ్ కూడా ఉన్నారు. ఆయన రాకను ముందుగానే తెలుసుకున్న అభిమానులు భారీగా ఘాట్‌కు తరలి వచ్చారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. అవేమీ పట్టించుకోని ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తమ తాత సమాధి వద్ద పుష్పాలు అలంకరించి నివాళి అర్పించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు ఎన్టీఆర్ మరణించినా, ప్రజల్లో ఇంకా బ్రతికే ఉన్నారన్నారు నందమూరి లక్ష్మీపార్వతి. తెలుగు ప్రజల మనసులో స్థిరమైన స్థానం సంపాదించిన వ్యక్తి అని కొనియాడారామె. అంతకుముందు ఘాట్‌కు వచ్చిన ఆమె ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. నటుడు, రాజకీయ నాయకుడిగా ఆయన పోషించిన పాత్ర మరువలేమన్నారు. జూన్ నాలుగు తర్వాత ఏపీలో సుపరిపాలన రాబోతోందని మనసులోని మాట బయటపెట్టారు. తెలంగాణలోనూ మంచి పరిపాలన అందించాలని కోరుకున్నట్లు తెలిపారు లక్ష్మీపార్వతి.
ఆంధ్రప్రదేశ్ లో మరిసోరి మంచి పరిపాలననే నడుస్తుందంటూ పరోక్షంగా ఏపీలో మూడోసారి కూడా వైఎస్సార్ సీపీనే అధికారంలోకి రాబోతుందని ఆమె పేర్కొన్నారు. జూన్ 4 తరువాత జగన్ మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని.. ఏపీలో మళ్లీ మంచిపాలన వస్తుందని ఆమె అన్నారు. వైఎస్ జగన్ కు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో భారీ చర్చ కొనసాగుతోంది. నిజంగా జగన్ కు మద్దతు ఉందా..? ఒకవేళ ఉంటే.. చంద్రబాబుకు ఇవ్వకుండా జగన్ కు ఎందుకు ఇస్తున్నారు..? ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారా..? ఇలా రకరకాలుగా ఇరు రాష్ట్రాల్లో భారీగా చర్చలు కొనసాగుతున్నాయి. అయితే నివాళులు అర్పించే సమయంలో బాలయ్య, లక్ష్మీ పార్వతి ఎదురెదురు పడగా, ఎవరి దారిలో వారు వెళ్లినట్టు తెలుస్తుంది.