B Tech Ravi : పులివెందులలో సీఎం వైఎస్ జగన్‌పై తిరుగుబాటు మొదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల స్థానాన్ని వైఎస్ జగన్ నుంచి టీడీపీ కైవసం చేసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులను పరిశీలిస్తున్న చంద్రబాబు నాయుడు పులివెందుల పూలఅంగళ్ల సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులను ఉద్దేశించి.. ‘‘వై నాట్ పులివెందుల’’ అని నినాదం చేశారు. పులివెందులలో తిరుగుబాటు ప్రారంభమైందని అన్నారు.
రాయలసీమ ప్రాంతానికి రావాల్సిన సాగునీటి ప్రాజెక్టులపై జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పులివెందుల, గండికోట, పైడిపాలెం, చిత్రావతికి నీళ్లు తెచ్చింది టీడీపీనేనని.. బానకచెర్లకు గోదావరి నీళ్లు తీసుకొచ్చి రాయలసీమకు సరిపడా నీళ్లు అందించడమే తన జీవిత ఆశయమని అన్నారు. ఇక టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి మాట్లాడుతూ.. వారికి రోడ్లే కాదు.. ఏదైనా కడగటం అలవాటేనని వ్యాఖ్యానించారు. వివేకారక్తాన్ని కూడా ఇలాగే కడిగారని గుర్తుచేశారు. పులివెందులలో ఎన్నడూ లేనివిధంగా భారీఎత్తున జనాలు బ్రహ్మరథం పట్టడం చూసి తట్టుకోలేక వైసీపీ వారు పసుపునీటితో రోడ్లు కడిగారన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తోటలకి నీళ్లు లేకపోతే పులివెందులకి ప్రత్యేకంగా తెప్పించాం. జగన్ మన ప్రాంతం వాడు.మనకు ఎక్కువ సాయం చేస్తాడు అని అనుకున్నారు. కాని ఆయన ఏం చేసింది ఏం లేదు..ఇన్సూరెన్స్ విధానంతో కూడా జగన్ మనల్ని మోసం చేశాడు.మనకు ఏ సాయం చేయలేని దద్దమ్మలు మనల్ని పాలిస్తున్నారు. ఒకసారి మీరు ఆలోచించాలని రవి అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఒక్క పరిశ్రమని కూడా ఏపీకీ తేలకపోయాడు.మనం తీసుకొచ్చి వారికి అండగా ఉందాం అంటూ రవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.