Auto Drivers : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటని అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెడతామని చెప్పగా, అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే దీనిని అమలు చేశారు. అయితే ఇది గొప్ప విషయమే అయినప్పటికీ వాహన రంగంపై ఆధారపడిన డ్రైవర్ల బతుకులు రోడ్డున పడుతాయని తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 15 లక్షల మంది డ్రైవర్లు ఉన్నారని, కుటుంబాలతో కలిసి 40 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వాహన రంగంపై ఆధారపడి బతుకుతున్నామని వివరించారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేవారు. వాహన రంగ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని, జీవన భృతి కింద నెలకు రూ.15వేలు ప్రభుత్వం అందించాలని కోరారు.
ఆటో మోటర్ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఆటో కార్మికులకు అర్హులైన వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించాలన్నారు. ఆటో మీటర్ రేట్లు పెంచి కొత్త ఆటో పర్మిట్లు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఓలా, ఊబర్ సంస్థలను ప్రభుత్వం ఆధ్వర్యంలోకి తీసుకోవాలని సూచించారు. నిర్మల్ జిల్లా మండల కేంద్రమైన కడెంలోని జాతీయ రహదారిపై ఇవాళ కడెం దస్తురాబాద్ మండలలోని ఆటో మ్యూజిక్ డ్రైవర్లు, యజమానులు అయితే ఉచిత బస్సు పథకంపై ఏకంగా రాస్తారోకో చేపట్టారు.
ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల తమ ఆటోలు నడవలేక తమ జీవనోపాధికి నష్టం కలుగుతుందన్నారు. ప్రతిరోజూ అధిక సంఖ్యలో మహిళలు ఆటోల్లో, టాటా మ్యాజిక్ వాహనంలో ప్రయాణించేవారని, దీంతో తాము ఉపాధి పొంది కుటుంబాన్ని పోషించే వాళ్లమని వారు పేర్కొన్నారు.ఉచిత బస్సు ప్రయాణం వల్ల తమకు తమ కుటుంబాలకు తీవ్రంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని, తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలో ఆందోళన చెందాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సీఎం డౌన్ డౌన్ నినాదాలు చేశారు. అనంతరం కడెం మండల తహసిల్దార్ రాజేశ్వరికి వినతిపత్రం అందజేశారు. మరి దీనిపై రేవంత్ ఎలా స్పందిస్తారో చూడాలి.