Anna Canteens Maintenance Cost : పేద ప్రజల ఆకలి కష్టాలను తీర్చేందుకు, రోజువారీ కూలీలకు భోజన ఖర్చు ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో రాయితీపై అల్పాహరం, భోజనం అందించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో ఇవి మూతపడగా, కొత్త ప్రభుత్వంలో తిరిగి ప్రారంభం అయ్యాయి. గుడివాడలో మొదటి అన్న క్యాంటిన్ ను పునఃప్రారంభించగా.. ఇతర ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు వీటిని పునఃప్రారంభించారు. ఈ నేపథ్యంలో హరేరామ ట్రస్ట్ వీటికి ఆహారం సబ్సిడీపై సరఫరా చేస్తోంది.
2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.5కే భోజనం అందించేందుకు అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లను మూసివేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో.. మళ్లీ అన్న క్యాంటీన్లను పున: ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో సీఎం చంద్రబాబు గుడివాడలో అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించబోతుంది. పేద ప్రజలకు ఆకలిని తీర్చు కార్యక్రమం కావడంతో పారిశ్రామికవేత్తలతో పాటు సామాన్య ప్రజలు సైతం అన్న క్యాంటీన్లకు విరాళాలు అందిస్తున్నారు.
అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం రూ.2కోట్లకు పైగా విరాళాలు అందాయి. దీంతో ప్రజల ఆసక్తిని గమనించిన ప్రభుత్వం సేకరించిన విరాళాలకు అకౌంట్‌బులిటీ ఉండాలనే ఉద్దేశంతో ఎస్‌బిఐలో ప్రత్యేక ఖాతా తెరిచింది. ప్రభుత్వ తాజా అంచనాల ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం పునఃప్రారంభమైన 100 అన్న క్యాంటిన్ల రోజు వారీ ఖర్చు అక్షరాలా రూ.78.75 లక్షలు అని తెలుస్తుంది. అంటే… నెలకు రూ.19.68 కోట్లని అర్ధమవుతుంది. ఈ ప్రకారం ఏడాదికి రూ.236.25 కోట్లు. ఇక వచ్చే నెలలో ఇప్పటికీ ఉన్న 100 క్యాంటిన్ లకు తోడు మరో 103 క్యాంటీన్లు పెరగనున్నాయని చెబుతుండగా, మొత్తం 203 క్యాంటిన్లకు రోజుకి రూ.1.59 కోట్లు.. నెలకు రూ.39.96 కోట్లు.. వెరసి ఏడాదికి రూ.479 కోట్లు ఖర్చు కానుందని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకొని ప్రతి ఒక్కరు అవాక్కవుతున్నారు.