Ambati Rambabu : ఏపీ సీఎం జగన్ చేపట్టిన అభ్యర్థుల మార్పు ప్రక్రియ వైసీపీకి కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. టికెట్ రాదని తెలిసి కొందరు పార్టీ మారుతున్నారు. మరికొందరేమో ఒక నియోకవర్గంలోని అభ్యర్థులు మరొక నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఆసక్తి కనబర్చడం లేదు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ కోవలోకే వస్తారు. గత లోక్‌సభ ఎన్నికల్లో శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ తరఫున నరసరావుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఆయన అక్కడి నుంచే పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
కానీ సీఎం జగన్ మాత్రం ఆయనను గుంటూరు నుంచి పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. శ్రీకృష్ణ దేవరాయలకు నరసరావుపేట ఎంపీ టికెట్ ఇవ్వమని చెప్పారు. అయితే తాను గుంటూరు నుంచి అయితే పోటీ చేయనని, నరసరావుపేట నుంచి అయితనేనే పోటీ చేస్తానని, లేదంటే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని శ్రీకృష్ణ దేవరాయలు వైసీపీ అధిష్టానానికి చెప్పారు. సీఎం జగన్ మాత్రం శ్రీకృష్ణ దేవరాయలు మాటను వినిపించుకోకుండా పంతానికి పోయారు. గుంటూరు, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ స్థానాలకు సంబంధించి వైసీపీలో పెద్ద పంచాయితీనే నడుస్తోంది. గుంటూరు ఎంపీ స్థానానికి గట్టి పోటీ ఉంది. ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరారు. గుంటూరు టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. అయితే, గుంటూరు టికెట్ ఇవ్వడం కుదరదని వైసీపీ అధిష్టానం తేల్చి చెప్పింది.

మరోవైపు అంబటికి టిక్కెట్ ఇవ్వొద్దని కొందరు వైసీపీ నాయకులు గట్టిగా చెబుతున్నారు.సత్తెనపల్లిలో అంబటి రాంబాబు సంబరాలు చేసుకోవడం ఒకటైతే, ఆయనకి అక్కడ టిక్కెట్ ఇస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ జడ్పీటీసీలు, ఎంపిటీసీలు. సర్పంచ్‌లు ఇలా ఒక్కొక్కరు అంబటి రాంబాబుపై గట్టిగా ఫైర్ అవుతున్నారు. తాడేపల్లికి చేరిన ఈ పంచాయితీని జగన్ ఎలా సాల్వ్ చేస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది.