Alla Ramakrishna Reddy : ఏపీలో ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో అనేక ఆసక్తికర అంశాలు చోటు చేసుకుంటున్నాయి.గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్సార్‌సీపీకి షాకిచ్చారు. ఎమ్మెల్యే పదవితో పాటుగా పార్టీకి రాజీనామా చేశారు.. స్పీకర్‌కు తన రాజీనామా లేఖను పంపారు. అలాగే పార్టీకి రాజీనామా చేసిన లేఖను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపారు. స్పీకర్‌కు పంపిన లేఖలో ఎలాంటి కారణాలను ప్రస్తావించలేదు.. కేవలం పదవికి రాజీనామా చేసినట్లు మాత్రమే చెప్పారు. రాజీనామాపై తమ్మినేని స్పందిస్తూ… ఆర్కేతో స్వయంగా మాట్లాడి రాజీనామా ఎందుకు చేశారో తెలుసుకుంటానని ఆయన తెలిపారు. ఆయన ఎందుకు రాజీనామా చేశారో తనకు తెలియదని చెప్పారు. రాజీనామాను ఆమోదించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయని అన్నారు. నిబంధనలకు అనుగుణంగానే తాను వ్యవహరిస్తానని చెప్పారు.
రాజీనామా తర్వాత ఆళ్ల..మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఆర్కే ధన్యవాదాలు తెలిపారు. 2014, 2019 ఎన్నికల్లో తనను గెలిపించారని.. తొమ్మిదిన్నరేళ్ల కాలంలో నీతి నిజాయితీతో, ధర్మంగా ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం కట్టుబడి పనిచేశానన్నారు. ఓ వైపు బాధగా ఉన్నా సరే.. కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. పార్టీతో పాటుగా ఎమ్మెల్యే పదవివికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. స్పీకర్‌కు లేఖ అందించాలని వెళ్లానని.. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఓఎస్డీకి రాజీనామా లేఖను అందించి ఆమోదించమని కోరానన్నారు. 1995 నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేశానని.. 2004లో సత్తెనపల్లి టికెట్‌ను ఆశించి భంగపడ్డానన్నారు. 2009లో పెదకూరపాడు టికెట్ ఆశించానన్నారు. ఆ తర్వాత వైఎస్సార్ మరణం.. వైఎస్ జగన్ వైఎస్సార్‌సీపీ ఏర్పాటు చేశారని.. ఆహ్వానం మేరకే పార్టీలో చేరానన్నారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని.. త్వరలోనే కారణాలు ఏంటో కూడా చెబుతానన్నారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా, మంగళగిరి తాడేపల్లి నగర అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి పార్టీ పేరుతో కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇప్పటికే మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ కార్యాలయం ఉండగా.. వేమారెడ్డి కార్యాలయం ఓపెన్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఆ తరువాత కూడా విభేదాలను సమసిపోయేలా చేసేందుకు సీఎం జగన్ ఏమాత్రం ప్రయత్నించలేదు సరికదా.. ఆళ్లను దూరం పెడుతూ వచ్చారని స్థానికంగా చర్చ జరుగుతోంది.. ఆ విభేదాలన్నీ పెరిగిపోయి చివరకు ఆయన రాజీనామా చేశారనే టాక్ వినిపిస్తోంది. అలాగే గంజి చిరంజీవికి వచ్చే ఎన్నికల్లో సీటు ఖాయమనే చర్చ జరుగుతోందట.. ఈ అంశం కూడా ఆర్కేను బాధపెట్టింది అంటున్నారు.