Akula Venkateshwar Rao : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ఇప్పుడు ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. ‘బాబు స్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు శుక్రవారం రాత్రి నంద్యాలలో బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం ఆర్కే ఫంక్షన్ హాలులో బస చేశారు. అర్ధరాత్రి 12 గంటల తరువాత 600 మందికిపైగా పోలీసులు నంద్యాలకు చేరుకున్నారు. అడుగడుగునా చెక్‌పోస్టులు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. చంద్రబాబు బస చేస్తున్న ఆర్కే ఫంక్షన్ హాల్‌ను ఎస్పీ రఘువీర్‌రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది పోలీసులు చుట్టుముట్టారు. అనంతరం డీఐజీ రఘురామిరెడ్డి, ఎస్పీ రఘువీర్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో టీడీపీ నేతలు గవర్నర్ ను కలవనున్నారు. ఇవాళ రాత్రి 7.15 గంటలకు గవర్నర్ నజీర్ టీడీపీ నేతలకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. చంద్రబాబు అరెస్టు, టీడీపీ నేతల గృహ నిర్బంధాలు, పోలీసుల తీరుపై గవర్నర్ కు టీడీపీ నేతలు ఫిర్యాదుచేయనున్నారు.
అయితే చంద్రబాబు అరెస్ట్‌తో ఇప్పుడు ఏపీలో ప్రకంపనలు రేగుతున్నాయి. కొందరు చంద్రబాబు అరెస్ట్‌ని ఖండిస్తుండగా, మరి కొందరు మాత్రం సంబురాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా వైసీపీ నేతలు చంద్రబాబు అరెస్ట్‌తో తెగ పండుగ చేసుకుంటున్నారు. అయితే టీడీపీ నేత ఒకరు స్వయంగా స్వీట్స్ పంచడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విజయవాడ కోర్ట్ దగ్గర ఆకుల వెంకటేశ్వరరావు అనే టీడీపీ నేత సంతోషంతో స్వీట్స్ పంచి పెట్టారు. ఈ సంఘటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరచింది. అయితే ఆయన చేసే పని టీడీపీ శ్రేణులకి కోపం తెప్పిస్తుందని భావించిన పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు.
గతంలో ఆకుల వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ నుండి తనకి ప్రాణ హాని ఉందని అన్నాడు. పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్న నా పేరు లోకేష్ తన దగ్గర ఉన్న రెడ్ బుక్‌లోకి ఎక్కించుకున్నాడు. జూబ్లిహిల్స్ లోని 400 గజాల స్థలాన్నిచంద్రబాబు మనిషి లాక్కున్నారని ఆయన ఆరోపించారు.అయితే చంద్రబాబుపై పీకల్లోతు కోపం పెంచుకున్న ఆకుల తాజాగా స్వీట్స్ పంచడం చర్చనీయాంశం అయింది. ఇక ఇదిలా ఉంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. దీంతో కోర్టు వద్ద, ఈ మార్గంలో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. దాదాపు 200 మంది పోలీసులను కోర్టు ప్రాంగణంలో మోహరించారు. కోర్టు వద్ద ఆందోళన చేస్తున్న టీడీపీ మహిళా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు.