Srikanth : ప్రస్తుతం బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపుతుంది. ఈ రేవ్ పార్టీలో సినీ పరిశ్రమకు చెందినవారు, డైరెక్టర్లు, హీరోలు, రాజకీయ ప్రముఖులు కొందరు మొత్తం 100 మంది పాల్గొన్నారని తెలుస్తుంది. అంతేకాదు ఈ రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్ పట్టుబడినట్టు సమాచారం. రేవ్ పార్టీలో హీరో శ్రీకాంత్, జానీ మాస్టర్, హేమ ఉన్నట్టు ప్రచారాలు జరగగా, వాటిని ఈ ఇద్దరు ఖండించారు. అయితే హేమ తప్పుదోవ పట్టించే ప్రయత్ని చేసింది కాని ఆమె రేవ్ పార్టీలో ఉన్నట్టు పోలీసులు తెలియజేశారు.ఇక శ్రీకాంత్ మాట్లాడుతూ.. నేను బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లినట్టు నన్ను అరెస్టు చేసినట్టు చాలామంది ఫోన్ చేసి మాట్లాడుతున్నారని ఆయన వాపోయారు.
రేవ్ పార్టీకి సంబంధించిన వీడియో క్లిప్స్ చూసానన్నారు. కొంతమంది మీడియామిత్రులు తనకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవడం వల్ల తనకు సంబంధించిన వార్తలను రాయలేదన్నారు. ఇక కొన్ని మీడియా ఛానల్స్ లో తాను రేవ్ పార్టీకి వెళ్లానని రాసారని ఆ న్యూస్ చూసి మా కుటుంబ సభ్యులందరం నవ్వుకున్నామన్నారు. వార్తలు రాసిన వాళ్ళు తొందరపడడంలో తప్పులేదు అనిపించిందని ఆయన పేర్కొన్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడిన వ్యక్తి ఎవరో కానీ కొంచెం తనలాగే ఉన్నాడని అతనికి కాస్త గడ్డం ఉందని ముఖం కవర్ చేసుకున్నాడని పేర్కొన్నారు. అతన్ని చూసి తానే షాకయ్యా అని చెప్పిన శ్రీకాంత్ దయచేసి నేనే అక్కడ ఉన్నానంటే ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.
తాను రేవ్ పార్టీలకు పబ్బులకు వెళ్లే వ్యక్తిని కానని, ఎప్పుడైనా బర్త్ డే పార్టీలకు వెళ్లినా కొద్దిసేపు మాత్రమే ఉండి వస్తానని చెప్పారు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా తనకు తెలియదన్నారు. విషయం తెలుసుకోకుండా రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ అంటూ థంబ్ నెయిల్స్ పెట్టేసి రాసేస్తున్నారని శ్రీకాంత్ అన్నారు. మీరు పొరపాటుతోనే రాస్తున్నారని నేను అనుకుంటున్నానని, దయచేసి తప్పుడు వార్తలను ప్రచురించొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రజలు కూడా తప్పుడు కథనాలు నమ్మకూడదని శ్రీకాంత్ కోరారు.