Actor Jiiva : ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘యాత్ర 2’. ఈ సినిమాకి మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. యాత్ర మూవీకి సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందించారు. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. పొలిటికల్ డ్రామాగా 2019 ఫిబ్రవరి 8న థియేటర్లలో విడుదలైన యాత్ర సూపర్ సక్సెస్ గా నిలిచింది. ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు జీవా నటిస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీ కూడా ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా,మూవీకి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
యాత్ర -2 సినిమా థీయేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉండగా, యూనిట్ తాజాగా మీడియా ముందుకు వచ్చారు. అక్కడ ఈ సినిమా కోసం అతను ఎలా కష్టపడ్డారు, ఎలా ఆ పాత్రలో ఒదిగారు అనే అంశం పై ముచ్చటించారు. ఈ క్రమంలోనే జీవాకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. అందులో మీరు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాత్ర చేసినప్పుడు ప్రతిపక్షం నుంచి మీకు ఎలాంటి బెదిరింపు కాల్స్ అయిన వచ్చాయా? అని ఒక రిపోర్టర్ అడిగారు. దానికి అతను స్పందిస్తూ.. ‘నాకు ఎటువంటి బెదిరింపు కాల్స్ రాలేదు కానీ, మెసేజ్స్ అయితే వచ్చాయని ఆయన పేర్కొన్నారు. జగన్ పై అనేక కేసులున్నాయని, ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందని, అలాంటి నేతను గొప్పగా చూపించాల్సిన అవసరం ఏంటని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు.
అందుకు దర్శకుడు మహి వి రాఘవ్ స్పందిస్తూ… ఎవరినీ గొప్పగా చూపించడం అనేది ఉండదని అన్నారు. ఇప్పుడున్న అందరు నేతలపైనా కేసులున్నాయి. మొన్నటివరకు మనం ఒకరినే ఎత్తిచూపించాం… ఇప్పుడు మిగతావాళ్లపైనా కేసులు ఉన్నాయి. కథను కథగానే చూడాలి. మనం డప్పు కొట్టుకున్నామా అనే విషయం ఆడియన్స్ తేలుస్తారు. ఇక జగన్ పరదాలు కట్టుకొని తిరుగుతున్నారు కదా, దానిని యాత్ర3లో చూపిస్తారా అని అడగ్గా, దానికి సంబంధించిన మహి.. ప్రతి ఒక్కరిపై బురద జల్లే ప్రయత్నం అవతలి వారు చూస్తుంటారు. వాటిని మనం పట్టించుకోకుండా మనపని మనం చూసుకోవాలని అని అన్నారు. ఇక దర్శకుడు మహి వీ రాఘవ్ యాత్ర -2 మూవీ వైఎస్ జగన్ పాదయాత్రను బేస్ చేసుకుని ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అలాగే యాత్ర- 2లో కేవలం వైఎస్ జగన్ చేసిన పాదయాత్రనే ఆధారంగా సినిమా ఉంటుందని, ఇతర పాత్రలకు ఎక్కువగా చూపించలేదని, ఎవ్వరినీ కించపర్చేలా అసలే పాత్రలను డిజైన్ చేయలేదని తెలియజేశారు.