AAG Ponnavolu Sudhakar Reddy : చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఒకే ఒక్క పేరు మారుమ్రోగిపోతుంది. ఆ పేరు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అదనపు అడ్వొకేట్ జనరల్. ఆయనే ఈ కేసును వాదించారు. సీఐడీ తరఫున సమర్థవంతంగా తన వాదనలను వినిపించగలిగారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి న్యాయమూర్తికి వివరించగలిగారు. చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ లూథ్రా వంటి కొమ్ములు తిరిగిన అడ్వొకేట్ వాదనలను సైతం వీగిపోయేలా చేయగలిగారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. చంద్రబాబు కేసును వాదించడానికి గంటకు రెండు కోట్ల రూపాయలను చంద్రబాబు చెల్లించినట్లు ఇదివరకే వార్తలొచ్చిన విషయం తెలిసిందే.
చంద్రబాబుకి సహకరించడానికి 27 మంది ఇతర సీనియర్లు, జూనియర్ న్యాయవాదులు చంద్రబాబు తరఫున వాదించారు. అలాంటి సీనియర్ అడ్వొకేట్ సమక్షంలో సీఐడీ తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి విజయవంతంగా తన వాదనలను ముగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు కావాల్సిన మందులు, ఆహారం అందుతున్నాయన్నారు. చంద్రబాబు విన్నపాలను పరిగణనలోనికి తీసుకున్నామని.. చట్టం ముందు అందరూ సమానమేనని పొన్నవోలు పేర్కొన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఆయన స్పష్టం చేశారు.

చంద్రబాబు అనుమతి లేనిదే ఆయన బ్లాక్‌కు ఎవరూ వెళ్లలేరని పొన్నవోలు పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్య పర్యవేక్షణకు డాక్టర్లు అందుబాటులో వుంటారని సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. సీఆర్పీసీ చట్టంలో హౌస్ అరెస్ట్ అనేది లేదని.. రాజమండ్రి జైలులో కట్టుదిట్టమైన భద్రత వుందని పొన్నవోలు పేర్కొన్నారు. ప్రైవేట్ హౌస్‌లో ఇంత భద్రత సాధ్యం కాదని.. ఎఫ్ఐఆర్‌లో పేరు లేకపోతే తప్పు చేయలేదని కాదని సుధాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాత్ర దర్యాప్తులో బయటపడిందని.. దర్యాప్తులో వెల్లడైన ఆధారాల ఆధారంగానే ఆయన పేరును చేర్చామన్నారు. ఆయన చేసిన తప్పుల వలనే జైలు బాట పట్టాడని, మరి కొందరు అవినీతి కేసులో బయటకు రానున్నారని పొన్నవోలు చెప్పుకొచ్చారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పడు ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి.