క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా చూడాలని ఉందని, దేవర సినిమా చూసేవరకైనా తనను బ్రతికించాలి అని అతను డాక్టర్లను వేడుకోవడం ప్రతి ఒక్కరిని షాక్ కు గురిచేసింది.తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్ట్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు, సరస్వతి దంపతుల పెద్ద కుమారుడు కౌశిక్ గత కొంత కాలంగా బ్లడ్ కేన్సర్ తో బాధ పడుతున్నాడు. ప్రస్తుతం కౌశిక్ చివరి స్టేజీ కేన్సర్ తో బాధ పడుతున్నట్లుగా వైద్యులు చెప్పారట. ఈ సమయంలో కౌశిక్ తల్లిదండ్రులకు.. నేను ఎలాగూ చనిపోతాను. మీరు బాధపడకండి.
ఎన్టీఆర్ దేవర సినిమా విడుదల అయి, నేను చూసే వరకు బతికించండి అంటూ విజ్ఞప్తి చేశాడట. ప్రస్తుతం బెంగళూరులో చికిత్స పొందుతున్న కౌశిక్ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బోన్ క్యాన్సర్ బారిన పడిన కౌశిక్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ డాక్టర్లను తనను సెప్టెంబర్ 27వ తేదీ వరకు దేవర సినిమా రిలీజ్ వరకు బ్రతికించాలని కోరుతున్నాడు.దేవర సినిమాను చూడడమే తన చివరి కోరిక అని చెబుతున్న కౌశిక్ వీడియోను ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరియు నెటిజన్లు పెద్ద ఎత్తున షేర్ చేస్తూ అతని కోరిక నెరవేరాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.
శ్రీనివాసులు, సరస్వతి దంపతులు తిరుపతిలో మీడియా ముందుకు వచ్చి తమ కొడుకు కౌశిక్ పరిస్థితిని తెలియజేసి కన్నీటి పర్యంతం అయ్యారు. తమ కొడుకు చివరి కోరిక తీర్చాలని మేము ప్రయత్నిస్తున్నాం. మాకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సాయం చేయాలని సరస్వతి విజ్ఞప్తి చేశారు. రూ.60 లక్షలతో బోన్ మారో చికిత్స చేయించాల్సి ఉందట. బెంగళూరులోని కిడ్‌వై ఆసుపత్రిలో ప్రస్తుతం కౌశిక్ కేన్సర్ చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే స్నేహితులు, సన్నిహితుల ద్వారా కొంత మొత్తం సాయం పొందిన కౌశిక్ కు ఇంకా భారీ మొత్తంలో చికిత్స కోసం డబ్బు అవసరం ఉందట.ఎన్టీఆర్ పైన వీరాభిమానంతో దేవర సినిమా చూసేవరకు బ్రతికించమని విజ్ఞప్తి చేస్తున్న కౌశిక్ ఆరోగ్య పరిస్థితి జూనియర్ ఎన్టీఆర్ వరకు చేరాలని ఎన్టీఆర్ అభిమానులు ఆయన్ని కూడా ట్యాగ్ చేస్తూ కౌశిక్ వీడియోను పోస్ట్ చేస్తున్నారు.