Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో మధ్యాహ్నం 3:45 గంటల సమయంలో ఆయనకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు, అభిమానులు అశ్రునయనాలతో ఆయనకు వీడ్కోలు పలికారు. మహాప్రస్థానంలో కృష్ణకు ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. ఇక ఆయన అంత్యక్రియల్లో ఘట్టమనేని కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అయితే సూపర్ స్టార్ కృష్ణను కడసారి చూసుకోవడానికి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అభిమానుల కోసం మహేష్ బాబు భోజన ఏర్పాట్లు చేశారు.
నిన్న మధ్యాహ్నం నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శనార్థం కృష్ణ పార్థివదేహాన్ని నానక్‌రామ్‌గూడలోని ఆయన నివాసంలో ఉంచారు. అయితే, అప్పటికే కృష్ణ ఇంటి వద్దకు అభిమానులు భారీ ఎత్తున చేరుకున్నారు. కానీ, అభిమానులను పోలీసులు లోపలికి అనుమతించలేదు. అభిమానుల కోసం నిన్న ఉదయం గచ్చిబౌలి స్టేడియంకు కృష్ణ భౌతికకాయాన్ని తరలిస్తామని మొదట ఘట్టమనేని కుటుంబ సభ్యులు ప్రకటించారు. కానీ, మంగళవారం సూర్యాస్తమయం కావడంతో నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఉదయాన్నే పద్మాలయ స్టూడియోకి తరలించి అభిమానుల సందర్శనార్థం ఉంచుతామని తెలిపారు. దీంతో గచ్చిబౌలి స్టేడియం వద్ద వేచి ఉన్న అభిమానులు సైతం కృష్ణ ఇంటికి, పద్మాలయ స్టూడియోకి చేరుకున్నారు.
కొన్ని గంటల పాటు అక్కడే వేచి ఉన్నారు. అయితే, అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో వారు భోజనం కోసం ఇబ్బంది పడకూడదని భావించిన మహేష్ బాబు భోజన ఏర్పాట్లు చేశారు. విజయకృష్ణ నిలయం వద్ద బయట అభిమానులకు భోజనాలు పెట్టారు. ఉదయం నుంచీ ఏమీ తినలేదని.. మా మహేష్ బాబు భోజనం పెట్టడంతో ఇప్పుడు తింటున్నామని రాయలసీమ నుంచి వచ్చిన అభిమానులు చెప్పారు. అంత విషాదంలోనూ మహేష్ బాబు మా ఆకలి తీర్చారు అని పలువురు అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసించారు.