మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ సూపర్ 12 మ్యాచ్‌లో జింబాబ్వేపై భారత్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే తడబడింది. ఆరంభం నుంచి వికెట్లను కోల్పోతూ వచ్చింది. దీంతో తక్కువ స్కోరుకే ఆలౌట్ అయింది. ఇక జింబాబ్వేపై భారత్ 71 పరుగుల భారీ తేడాతో బంపర్ విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ గ్రూప్ 2లో టాప్ పొజిషన్‌కు చేరుకుంది. ఇప్పటికే సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్.. ఇంగ్లండ్‌తో తలపడనుంది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా మొదట బ్యాటింగ్ చేయగా.. జింబాబ్వే ఫీల్డింగ్ చేసింది. ఈ క్రమంలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ రాణించారు. 25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో యాదవ్ 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో రాహుల్ 51 పరుగులు చేశాడు. జింబాబ్వే బౌలర్లలో విలియమ్స్ 2 వికెట్లు తీయగా.. రిచర్డ్ ఎన్‌గరవ, బ్లెస్సింగ్ ముజరబని, సికందర్ రాజాలకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 17.2 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. జింబాబ్వే బ్యాట్స్‌మెన్‌లలో ర్యాన్ బర్ల్ 35 పరుగులు, సికందర్ రాజా 34 పరుగులు చేశారు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ షమి, హార్దిక్ పాండ్యాలు చెరో 2 వికెట్లు తీశారు. భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్‌లకు తలా 1 వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్‌లో విజయంతో భారత్ గ్రూప్ 2లో టాప్ జట్టుగా నిలిచింది. దీంతో సెమీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ నెల 10వ తేదీన గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు జరగనుంది. అడిలైడ్ మైదానంలో మ్యాచ్ నిర్వహిస్తారు. ఇక సెమి ఫైనల్ 1లో న్యూజిలాండ్, పాక్‌లు తలపడతాయి. ఈ మ్యాచ్ ఈ నెల 9వ తేదీన బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు జరుగుతుంది. ఈ రెండు మ్యాచ్‌లకు తోడు ఫైనల్ మ్యాచ్‌కు కూడా రిజర్వ్ డే ఉంది. వర్షం కారణంగా ఆట నిలిచిపోతే మరుసటి రోజు ఆటను కొనసాగిస్తారు. ఇక సెమీస్ లో గెలిచిన జట్లు ఈ నెల 13వ తేదీన మెల్‌బోర్న్‌లో ఫైనల్ మ్యాచ్‌లో తలపడతాయి. ఈ మ్యాచ్ కూడా మధ్యాహ్నం 1.30 గంటలకు కొనసాగుతుంది.