KA Paul : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎన్నికల్లో తన దండయాత్రను కొనసాగిస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలోని విశాఖపట్టణం నుంచి బరిలోకి దిగిన ఆయనకు ఘోర పరాజయం ఎదురుకావడం మనం చూశాం. ఎక్కడ పోటీ చేసిన కూడా ఆయనకి పరాజయాలే ఎదురవుతున్నాయి.ఇటీవల జరిగిన ఎన్నికలలో చాలా పోలింగ్ బూత్‌లలో ఒక్క ఓటు కూడా పోల్ కాలేదు. మురళీనగర్‌లోని 235 బూత్‌లో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి, సోదరుడు, సోదరి సహా 22 మంది కుటుంబ సభ్యులు ఓటేస్తే తనకు అక్కడ వచ్చినవి నాలుగంటే నాలుగు ఓట్లేనని చెప్పారు.
1995లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసింది తానేనని, అప్పట్లో మోదీ ఓ సాధారణ ఎమ్మెల్యే అని గుర్తుచేశారు. ఈసారి సీసీటీవీ లింక్‌లను అభ్యర్థులకు ఇవ్వలేదని, తనకు పడాల్సిన లక్షలాది ఓట్లు పడకుండా అడ్డుకున్నారని, చివరికి తన కుటుంబ సభ్యుల ఓట్లు కూడా పడలేదని వాపోయారు. తాను లీడ్‌లో ఉన్నట్టు అధికారులే చెప్పారని, కానీ 8 బూత్‌లలో తనకు ఒక్క ఓటు కూడా పడకపోవడం వెనక కుట్ర ఉందని ఆరోపించారు. ఇక తాజాగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం గురించి కూడా మాట్లాడారు కేఏ పాల్. మోదీకి మనం ఇచ్చే మెసేజ్ ఒక్కటే. రైల్వే జోన్‌లు కట్టారా, స్పెషల్ స్టేటస్ ఇచ్చారా, 15 లక్షలు ఇస్తా అన్నారు ఇచ్చారా, ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఇచ్చారా, స్టీల్ ప్లాంట్ అమ్మనని ఎందుకు అమ్ముతున్నారు.
ఒక్కటైన చేశారా.. కాని ఆయన చేసిందేంటి. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లతో హగ్గులు, స్మైల్స్ చంద్రబాబు నాయుడికి. మళ్లీ నన్ను జైల్లో పెట్టకూడదని ఆయన కాకా పడుతున్నారు. తెలుగు ప్రజలరా మీరు నాతో పాటు నడవండి. కలిసి పోరాడదాం. ఇవన్నీ ఎలా సాధించాలో నేను చెబుతాను. మన పోరాటం ఆగదు. 77 సంవత్సరాల తర్వాత ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారు. నేను బీసీ, నేను కాపునే. ఈవీఎంలు ట్యాంపర్ చేసి వారు గెలిచారు. వీటన్నింటిని అరికట్టాలంటే బడుగు, బలహీన వర్గాల వారందరు కలిసి నాతో కలవండి. మన రాష్ట్రాన్ని వదలొద్దు అంటూ కేఏ పాల్ కామెంట్ చేశాడు.