KA Paul : ఏపీ రాజకీయాలు ఇప్పుడు రంజుగా మారుతున్న సమయంలో ఒక్కొక్కరు ఒక్కో టైపులో ప్రచారం చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విలక్షణమైన పొలిటీషియన్, ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్. ఈయన రాజకీయాలలో చాలా ఆసక్తికరంగా మారారు. ఏ పార్టీనైనా… ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ ఇలా ఎవరినైనా ఏకి పారేస్తూ వార్తలలో నిలుస్తూ ఉంటారు. ఇక రకరకాల వ్యూహాలను అమలు చేస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు. ముఖ్యంగా విశాఖలోని మత్య్సకారుల ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టారు కేఏ పాల్. ఇందులో భాగంగా ఆయన మత్య్సకారులతో కలిసిపోయి చేపలు పట్టేశారు. వాళ్ల సమస్యలు తనకు పూర్తిగా తెలుసన్న ఆయన.. మినీ హార్బర్ కట్టాలని ఎప్పటినుంచో వాళ్లు కోరుతున్నారని అన్నారు.
ఈసారి ఎన్నికల్లో తాను గెలిస్తే కచ్చితంగా మినీ హార్బర్ కట్టిస్తానని హామీ ఇచ్చారు పాల్. ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న కుటుంబాలను తాను అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీ చెప్పుకొచ్చారు. విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న కుండ గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని మత్య్సకారులను కోరారు. కేఏపాల్ ఎక్కడ ప్రచారం చేసినా తనతోపాటు పార్టీ గుర్తును తీసుకెళ్లి ఓటర్లకు పరిచయం చేస్తూ ఉండడం విశేషం.. ఈవీఎంల్లో తన నెంబర్ ఫలానా అని చెబుతూ ఆటోడ్రైవర్ల వద్దకు వెళ్తే వాళ్లకు భరోసా ఇచ్చారు. జగన్ నవ రత్నాలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆయనకు ధీటుగా కేఏ పాల్ మాత్రం దశ రత్నాలతో మేనిఫెస్టోను రూపొందించారు. దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తనకు కవరేజ్ ఇచ్చిన ఛానెళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తానని మీడియాను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారుకేఏ పాల్.
ఒకవేళ హామీలకు నిధులు ఎక్కడ నుంచి వస్తాయని ఎవరైనా అడిగితే.. అమెరికా ప్రెసిడెంట్ మనోడే.. కోట్లలో నిధులు వస్తాయని సింపుల్‌గా ఒక్కముక్కలో చెబుతారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ కట్టించేందుకు నిధులు తానే ఇచ్చానని అంటారు కేఏ పాల్. గతరాత్రి విశాఖ బీచ్‌లో ప్రచారం చేసిన ఆయన, సైకిల్, ఫ్యాన్‌ను మరిచిపోయి కుండ గుర్తుకే ఓటేయాలని పర్యాటకులను తెలిపారు. చంద్రబాబుకు అమెరికా ఎక్కడ ఉందో తెలీదని, బిల్‌గ్రేట్స్‌ను ఆయనకు తానే పరిచయం చేశానన్నారు. పవన్ బీజేపీతో కలిశారని, ఆయన అన్న కాంగ్రెస్‌లో కలిశారని గుర్తు చేశారు.