Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ నటుడిగానే కాదు రాజకీయ నాయకుడిగా కూడా సత్తా చాటుతున్నారు. హిందూపూర్ ఎమ్మెల్యేగా రెండుసార్లు సత్తా చాటిన బాలయ్య ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధం అయ్యారు. హిందూపురం టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ తన నామినేషన్ దాఖలు చేశారు. హ్యాట్రిక్ విజయం కోసం ఆయన హిందూపూర్ లో ప్రయత్నిస్తున్నారు. భారీ ర్యాలీతో బయలుదేరిన నందమూరి బాలకృష్ణ తొలుత సూగూరు ఆంజనేయస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు నిర్వహించారు. ముందుగా హిందూపురంలోని తన ఇంటి నుంచి కార్యకర్తలతో కలిసి నందమూరి బాలకృష్ణ నామినేషన్‍కు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.
నామినేషన్ కార్యక్రమానికి హిందూపురంలో టీడీపీ కార్యకర్తలతో పాటు బాలకృష్ణ అభిమానులు పెద్దయెత్తున తరలి వచ్చారు. వారితో బాలయ్య చేసిన కామెడీ ప్రతి ఒక్కరిని నవ్వించింది. మనకు ఎండ అంటే భయం లేదు. నన్నే చూసి ఎండకు భయం. ఎప్పుడు స్ట్రెయిన్ కాను. షూటింగ్స్ సమయంలో కూడా నేను కారవ్యాన్‌లో ఎక్కువగా కూర్చోను అని అన్నారు బాలయ్య. ఇక ఫ్యాన్స్ అయితే రోజురోజుకి మీరు ఫుల్ ఎనర్జిటిక్‌గా మారుతున్నారంటూ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. బాలయ్య ఫ్యాన్స్ తో చేసిన సందడి నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంది. ఎప్పుడు చిర్రుబుర్రులాడే బాలయ్య ఇలా ఫన్నీగా ఉండడం చూసి ప్రతి ఒక్కరు స్టన్ అవుతున్నారు.
ఇక సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడతలో జరుగనున్న ఏపీ శాసనసభ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఇటీవల ప్రారంభమైంది. మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జరుగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏప్రిల్ 25 తేదీ వరకూ నామినేషన్లు దాఖలు చేసేందుకు తుది గడువుగా ఈసీ ప్రకటించింది. 26వ తేదీన నామినేషన్లు పరిశీలన చేయనున్నారు. అలాగే 29 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువుగా పేర్కొన్నారు. ఇక ఈ నెల 25 నుంచి ఉత్తరాంధ్రలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది.