Indian Cricketers : మరి కొద్ది రోజులలో ఐపీఎల్ 2024 ఘనంగా ప్రారంభం కానుంది. ధనాధన్ షాట్స్‌తో బ్యాట్స్‌మెన్స్, మెరుపు వేగంతో బౌలర్స్ బంతులు విసురుతూ క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందిస్తుంటారు. మార్చి 22న స్టార్ట్ కానున్న ఈ టోర్నీలో తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్. ఇక ఇప్పటికే ప్లేయర్లు తమ ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ శిబిరాల్లోకి చేరి, ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. అయితే ఈ సీజన్ కు సంబంధించి గతేడాది జరిగిన మినీ వేలంలో ప్లేయర్లపై ఫ్రాంచైజీలు కోట్ల వర్షం కురిపించడం మనం చూశాం.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ లో ఆ రూల్ తీసేస్తే.. ఆ ప్లేయర్లు కచ్చితంగా రూ. 100 కోట్లకు అమ్ముడుపోతారని చెప్పుకొచ్చాడు. ఈసారి జట్టులో ఇద్దరు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లను ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరలకు కొనుగోలు చేశారు. మిచెల్ స్టార్క్ ను కోల్ కతా నైట్ రైడర్స్ రూ.24.75 కోట్లకు, పాట్ కమిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ .20.50 కోట్లకు కొనుగోలు చేశాయి. ఈ క్రమంలో ఊతప్ప మాట్లాడుతూ.. ఐపీఎల్ లో ఫ్రాంచైజీలకు కళ్లెం వేయకపోతే, నిబంధనలు విధించకపోతే ఐపీఎల్ సినిమా మామూలుగా ఉండదని అన్నాడు. అదేగానీ జరిగితే టీమ్ఇండియాలో టాప్ 10 ప్లేయర్లు ఒకొక్కరు రూ.100 కోట్లు పలుకుతారని అన్నాడు.
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఒకొక్క ఫ్రాంచైజీ ఆటగాళ్లు అందరికీ కలిపి రూ. 100 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టాలని నిబంధన ఉంది. ఫ్రాంచైజీలకు రూ. 500 కోట్ల నుంచి రూ. 1000 కోట్ల లిమిట్ ఉంటే ఇది జరుగుతుంది. ఈ లిస్ట్ లో ఫస్ట్ పేరు జస్ప్రీత్ బుమ్రాది కాగా.. తర్వాత విరాట్, రోహిత్, పాండ్యా, సూర్యకుమార్, జైస్వాల్, గిల్ 100 కోట్ల ధర దక్కించుకుంటారు” అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ఊతప్ప.అలాగే కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజాలు రూ. 80 నుంచి 100 కోట్ల మధ్యన అమ్ముడవుతారని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఊతప్ప చేసిన ఈ వ్యాఖ్యలు ఐపీఎల్ లో ఆసక్తికరంగా మారాయి.