MLA Sudheer Reddy : తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగడం మనం చూశాం. చాలా మంది స్థానిక నేతలు కూడా ఆ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేరు కూడా వినిపించింది. ఈ నేపథ్యంలో సుధీర్ రెడ్డి స్పందిస్తూ… ఈ వార్తల్లో నిజం లేదని చెప్పారు. ప్రజాసేవ చేయడానికి పార్టీ మారాల్సిన అవసరం లేదని అన్నారు. తొందరపడి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారరని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల వైపు ఉండాలనే భావజాలంతో తాము పని చేస్తామని సుధీర్ రెడ్డి అన్నారు. ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేస్తామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మీడియాతో మాట్లాడిన ఆయన .. కాంగ్రెస్ ప్రభుత్వానికి నాలుగైదు నెలల సమయం ఇస్తామని… ఈలోగా ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే, ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరిస్తామని చెప్పారు. తమ అధినేత కేసీఆర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించడం ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. కేసీఆర్ ను రేవంత్ పరామర్శించడాన్ని కూడా కొందరు తప్పుపడుతున్నారని విమర్శించారు. అయితే ఓ సభలో మాట్లాడిన సుధీర్ రెడ్డి.. చాలా మంది ఆయనని కలిసేందుకు ఆసక్తిగా ఉన్నారని, వారి బాధలని తెలిజేసేందుకు నేను స్వయంగా రేవంత్ రెడ్డిని కలుస్తానంటూ కామెంట్స్ కూడా చేశారు.
ఎల్బీనగర్ వాసులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న బైరామల్ గూడ మల్టీలెవల్ ఫ్లైఓవర్ ఇటీవల వినియోగంలోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి మంత్రులు శ్రీధర్ బాబు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ తదితరులు ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగిస్తామని.. ఇందులో రాజీపడబోమని సీఎం అన్నారు.