CM YS Jagan : మరి కొద్ది రోజులలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో సీఎం జగన్ అక్కడి ప్రజలకి వరాల జల్లు కురిపిస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఏటా పెన్షన్ ను పెంచుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి.వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద పెన్షన్ ను రూ. 3 వేలకు పెంచారు. తమ ప్రభుత్వం పెన్షన్ల కోసం రూ. 1968 కోట్లను ఖర్చు చేస్తుందని జగన్ చెప్పారు. తెలుగు దేశం ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల కంటే ఐదు రెట్లు ఎక్కువ అని జగన్ వివరించారు. అయితే తన చెల్లి సుచరిత పెన్షన్ పెంచమని కోరడంతో పాటు ఘాట్ రోడ్ కోసం 39 కోట్లు కూడా ఖర్చు చేయనున్నామని కూడా జగన్ హామీ ఇచ్చారు.
మరో చారిత్రక విజయం అందుకునేందుకు సిద్ధమా.. ఇంటింటి భవిష్యత్తును మార్చేందుకు సిద్ధమా… పేదల భవిష్యత్తును మార్చేందుకు సిద్ధమా..దుష్ట చతుష్టయం మీద యుద్ధానికి సిద్ధమా.. అని వైసీపీ శ్రేణుల్ని ప్రశ్నించారు. రామాయణం, భారతంలో విలన్లంతా ఎల్లో మీడియా, విపక్షాల రూపంలో ఇక్కడే ఉన్నారంటూ జగన్ గుర్తుచేశారు. ఇంతమంది తోడేళ్ల మధ్య జగన్ ఒంటరిగానే కనిపిస్తాడని, కానీ కోట్ల మంది హృదయాల్లో ఉన్నాడన్నారు. విపక్షాల సైన్యం పొత్తులు, ఎల్లో మీడియా అయితే తన సైన్యం దేవుడు, ప్రజలే అని జగన్ తెలిపారు. ఇక్కడ కనిపిస్తున్న జనమే తన నమ్మకం, బలం అన్నారు. వచ్చే పోరులో మీరు కృష్ణుడైతే.. నేను అర్జునుడిని అన్నారు.
వైసీపీ ప్రభుత్వ సంక్షేమం, మంచిపై విపక్షాలు దాడి చేస్తున్నాయని, పేదవాడి సంక్షేమం మీద, రాబోయే తరం విద్యావిధానాలపై దాడి చేస్తున్నారన్నారు. గ్రామాల్లో మార్పు కనిపిస్తోందని, తమ సంక్షేమ పాలనకు ప్రతీ పేద కుటుంబమే సాక్ష్యమన్నారు. 175కు 175 అసెంబ్లీ సీట్లు, 25కు 25 ఎంపీ సీట్లు గెల్చుకోవడమే తమ లక్ష్యమన్నారు. తన మాటల్ని ప్రతీ కుటుంబానికీ చేరవేయాలని కోరారు. 2019 ఎన్నికలకు ఆరు మాసాల ముందు పెన్షన్ ను రూ. వెయ్యి రూపాయాలను 39 లక్షల మంది లబ్దిదారులకు ఇచ్చేవారన్నారు. ఆనాడు చంద్రబాబు సర్కార్ రూ. 400 కోట్లు కేటాయించిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. తమ ప్రభుత్వం రూ. 2 వేల కోట్లను ప్రతి నెలా పెన్షన్ కోసం ఖర్చు చేస్తుందని ఇప్పుడు దానిని కూడా పెంచే ఆలోచన చేస్తామని స్పష్టం చేశారు.