YSRCP : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2019లో ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. 175 స్థానాలకు గాను ఏకంగా 151 ఎమ్మెల్యే సీట్లను గెలుపొంది అఖండ విజయం సాధించింది. తరువాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయి ప్రజలకు మెచ్చిన విధంగా పాలన అందిస్తూ వస్తున్నారు. ఇక త్వరలోనే మళ్లీ ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓ వైపు వైసీపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలకు సిద్ధం కాగా, టీడీపీ, జనసేన కూటమి పొత్తులు, సీట్లు ఇంకా ఖరారు కాలేదు. అయినప్పటికీ వైసీపీ ఈసారి గెలవదని తామే అధికారంలోకి వస్తామని టీడీపీ, జనసేన నేతలు చెబుతున్నారు.
అయితే జగన్ మళ్లీ రెండోసారి సీఎం అవుతారని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని అంటున్నారు. అందుకు పలు సర్వేలను కూడా వారు సాక్ష్యాలుగా చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో సంస్థ సర్వే చేసి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఏపీలో ఈసారి కూడా మళ్లీ వైసీపీయే అధికారంలోకి వస్తుందని చెప్పింది. ఈ మేరకు ఎన్ఏఐ అనే సంస్థ తాను చేపట్టిన సర్వే వివరాలను వెల్లడించింది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మళ్లీ వైసీపీదే అధికారమని ఎన్ఏఐ తెలియజేసింది. తాము డిసెంబర్ 1 నుంచి జనవరి 12 వరకు మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే చేశామని అన్ని ఫలితాలూ వైసీపీకే అనుకూలంగా ఉన్నాయని చెప్పింది. అయితే వైసీపీకి ఈసారి సీట్లు తగ్గుతాయేమోకానీ అధికారంలోకి మాత్రం ఆపార్టీనే వస్తుందని, వైసీపీకి సుమారుగా 120కి పైగా సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలియజేసింది.
ఇక టీడీపీ, జనసేన కూటమి అసలు ప్రభావం చూపే అవకాశం లేదని, ఆ పార్టీలకు ఉమ్మడిగా 40 నుంచి 50 వరకు సీట్లు వస్తాయని అంచనా వేసింది. అయితే ఇప్పటికే సర్వేలపై టీడీపీ, జనసేన కూటమి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు డబ్బులిచ్చి పెయిడ్ సర్వేలు చేయిస్తున్నారని, అసలు ప్రజలు తమకు అనుకూలంగా ఉన్నారని, తమ కూటమే అధికారంలోకి వస్తుందని వారు అంటున్నారు. అయితే ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారు అనేది తెలియాలంటే మరికొద్ది నెలల పాటు వేచి చూడక తప్పదు.