Ambati Rayudu : మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో కలవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వైసీపీలో చేరిన అంబటి రాయుడు, 10 రోజుల్లోనే ఆ పార్టీని వీడారు. పవన్ తో అంబటి రాయుడు భేటీ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అంబటి రాయుడు పవన్ కల్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారా? జనసేనలో చేరుతున్నారా? అనే విషయంపై ఆసక్తినెలకొంది.అంబటి రాయుడు డిసెంబర్‌లో వైఎస్సార్‌సీపీలో చేరారు.. ఈ నెల 6న పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కేవలం పది రోజులు మాత్రమే పార్టీలో కొనసాగారు.
వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేయడానికి కారణాన్ని కూడా తెలిపారు రాయుడు. క్రికెట్ ఆడటం కోసం రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ మరో ట్వీట్ చేశారు. త్వరలో దుబాయ్‌లో జరుగనున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ఆడనున్నట్లు వెల్లడించారు. ప్రొఫెషన్ క్రికెట్ లీగ్‌లో ఆడాలంటే ఏ రాజకీయ పార్టీతో అనుబంధం ఉండకూడదు. అందుకే వైసీపీ రాజీనామా చేసినట్లు రాయుడు చెప్పుకొచ్చాడు. అంబటి రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. దీంతో ఆయన జనసేనలో చేరితో పార్టీకి లాభం చేరుకుందని జనసైనికులు భావిస్తున్నారు. రాయుడు జనసేనలో చేరితో మేలు జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గుంటూరు ఎంపీ టికెట్ ఆశిస్తున్న రాయుడు…సీటు హామీ దక్కితే జనసేన కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది.
గత ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడిన అంబటి రాయుడు…సీజన్ ముగియగానే ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అనంతరం ఏపీ రాజకీయాల్లో కొన్నాళ్ల పాటు యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నించారు. వైసీపీకి మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే అంబటి రాయుడు… ఐపీఎల్ రిటైర్మెంట్ అనంతరం గుంటూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. వైసీపీకి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి అంబటి రాయుడు మద్దతుగా వ్యవహరించారు. కాని ఇంతలో జనసేనాని కలవడంపై ఇప్పుడు హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి. అయితే పవన్‌ని రాయుడు కలవడం వెనక మెగా పవర్ స్టార్ ఉన్నాడనే ప్రచారం జరుగుతుంది. మరి దీనిపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది.