Sajjanar : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలకి అంతా మంచే జరుగుతుంది.ముఖ్యంగా మహిళలకి ఉచిత బస్సు పథకం కింద తెలంగాణలో ఎక్కడి నుండి ఎక్కడికైన తిరగవచ్చు అన్నట్టుగా పేర్కొన్నారు.మునుపెన్నడూ లేని విధంగా మహిళలు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే ఉచిత బస్సుల ప్రయాణం విషయంలో కొన్ని సమస్యలు ఎదురువుతున్నట్లు ఆర్టీసీ దృష్టికి వచ్చింది. ఈ విషయమై తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు.తక్కువ దూరం ప్రయాణించే మహిళలు సైతం ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఎక్కువగా వెళ్తున్నట్లు యాజమాన్యం దృష్టికి వచ్చిందని సజ్జనార్ తెలిపారు. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందన్నారు.
తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి సహకరించాలని సజ్జనార్ కోరారు. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు కూడా, పల్లెవెలుగు బస్సుల బదులు, ఎక్స్‌ప్రెస్ బస్సులనే ఎక్కుతున్నారు. కొద్ది దూరం ప్రయాణించగానే, బస్సు దిగుతున్నారు. ఇలా కొద్ది దూరం ప్రయాణించేవారు ఎక్కడం, దిగడం జరుగుతూ ఉండటం వల్ల.. ఎక్స్‌ప్రెస్ బస్సుల ప్రయాణ వేగం తగ్గిపోయి, లాంగ్ జర్నీ చేసేవారికి బాగా ఆలస్యం అవుతోంది. ఈ విషయంపై సజ్జనార్ ఇలా స్పందించారు. అలాగే, కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారన్న సజ్జనార్.. దీంతో ప్రయాణ సమయం పెరుగుతోందని చెప్పుకొచ్చారు. ఇకపై ఎక్స్‌ప్రెస్ బస్సులను కేవలం అనుమతించిన స్టేజీల్లోనే ఆపుతామని ఆయన తేల్చి చెప్పారు. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని సజ్జనార్ కోరారు. మహా లక్ష్మీ పథకం సక్రమంగా అమలు చేయడానికి మహిళలు, చిన్నారులు, ట్రాన్స్‌జెండర్స్ మరింత సహకరించాలని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. ఉచిత ప్రయాణ సదుపాయం పలు ఇబ్బందులకు కారణం అవుతోంది. సోషల్ మీడియాలోనూ ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఫ్రీ జర్నీ కల్పిస్తూనే.. బస్సుల సంఖ్యను తగ్గించదనే విమర్శ టీఎస్ ఆర్టీసీ ఎదుర్కొంటోంది. అయితే అలాంటిదేం లేదని.. బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు ఆర్టీసీ చెబుతోంది.