Balakrishna : నందమూరి బాలకృష్ణ పంథా మార్చారు. సినిమాలతో పాటు షోస్ చేస్తున్నారు. అలానే ఇప్పుడు పలు షాప్‌లకి బ్రాండ్‌గా ఉంటున్నారు. తాజాగా పటాన్‌చెరులో వాల్యూజోన్ హైపర్ మార్ట్‌ను ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో అతిపెద్ద ఔట్‌లెట్ మాల్ వాల్యూజోన్‌ను సంస్థ ప్రముఖులు వెంకటేశ్వర్లు, రాజమౌళి, ప్రసాదరావులతో కలిసి ఆయన ప్రారంభించగా, బాలకృష్ణను చూసేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్థ యాజమాన్యంతో తనకు చాలా స్నేహం ఉందన్నారు. ఈ వాల్యూజోన్ హైపర్ మార్ట్ రిటైల్ వాణిజ్య వ్యవస్థలోనే ఒక వినూత్న విప్లవమన్నారు.
హైదరాబాద్‌లోనే అతి పెద్ద మార్ట్ వాల్యూజోన్ అని కొనియాడారు. తనను వాల్యూజోన్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం సంతోషాన్ని కలిగిస్తున్నదన్నారు. సరికొత్త వ్యాపార ఆలోచనతో యాజమాన్యం ముందుకు వచ్చిందని, తప్పకుండా ప్రజలు ఆదరిస్తాని తనకు నమ్మకం ఉందన్నారు. ఫ్యాషన్, ఫుడ్, ఫన్ ఒకేచోట ఉండడంతో ప్రజలు ఆహ్లాదరకరమైన షాపింగ్ అనుభూతిని పొందుతారన్నారు. కొత్త రకమైన ఆలోచనలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందన్నారు. పూర్వకాలంలో తన తండ్రి ఎన్టీఆర్ కూడా కొత్త ఆలోచనలతో ముందుకుపోవడంతోనే చరిత్ర సృష్టించారన్నారు. అన్ని రకాలైన వస్తువులు ఒకేచోట లభ్యం కావడంతో డబ్బు, సమయం ఆదా అవుతుందన్నారు. వాల్యూజోన్ హైపర్ మార్ట్ సక్సెస్ కావాలని ఆయన ఆకాంక్షించారు.
ఏదైన పని చేస్తే అది గుర్తుండిపోవాలి. ముందు ఎవరు ఆ పని చేస్తారో ఎప్పటికీ అది గుర్తుండిపోతుంది. అన్ని రంగాలలో హైదరాబాద్‌ని అభివృద్ది చేయాలనే ఉద్దేశంతో సైబరాబాద్ అయితే ఏంటి, హైటెక్ అయితే ఏంటి, కన్వెన్షన్ సెంటర్స్ అయితే ఏంటి ఇలా అన్ని రకాలుగా ప్రపంచ పారిశ్రామిక వేత్తలని, టూరిస్ట్‌లని ఆకర్షించే విధంగా చంద్రబాబు నాయుడు బీజం వేసారు. ఆయన బీజం వేసాక అభివృద్ది కాదు. అది జరుగుతూనే ఉంది. ఇది అన్‌స్టాపబుల్ అని బాలయ్య అన్నారు.