Minister Sridhar Babu : గవర్నర్ ప్రసంగంలోని పలు అంశాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ ప్రసంగం నుంచి కొన్ని పదాలను తొలగించాలని ఎమ్మెల్సీ కవిత సవరణలను ప్రతిపాదించారు. శాసనమండలి ఆవరణలో కవిత మీడియాతో మాట్లాడుతూ.. అభ్యంతరకరమైన పదాలను గవర్నర్ ప్రసంగంలో నుంచి తొలగించాలంటూ తాను సవరణలు ప్రతిపాదించానని తెలిపారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రమంలో తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అవమానించేలాగా వ్యాఖ్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు.
కానీ మండలి సమావేశం తొలిరోజే కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు కొత్త ప్రభుత్వానికి సహకరించాలన్న ఉద్దేశంతో ఆ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రతిపాదిత ఉపసంహరించుకున్నానని వివరించారు. బీఆర్ఎస్ పార్టీకి మండలిలో మెజారిటీ ఉన్న నేపథ్యంలో తమ సవరణలు ఆమోదం పొందే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వానికి సహకరించాలి అన్న ఆలోచనతో ఉపసంహరించుకున్నామని చెప్పారు. అదే స్ఫూర్తిని ప్రభుత్వం కూడా కొనసాగించాలని సూచించారు.
అయితే కవిత వ్యాఖ్యల తర్వాత రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా తప్పులతడకే అని.. తాము ఎప్పటికీ ప్రజాపక్షమే తెలంగాణ పక్షమే.. కాంగ్రెస్ ఎప్పటికీ విపక్షమే అన్న కేటీఆర్ కామెంట్స్‌పై రేవంత్ మండిపడ్డారు. కేటీఆర్‌ను ఎన్‌ఆర్‌ఐ అంటూ సెటైర్ వేశారు. అలానే కవితపై ఇన్‌డైరెక్ట్ పంచ్‌లు విసిరారు. ఇక ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సైతం విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని అన్నారు. వారి మాటలు ఒకలా, చేతలు మరోలా ఉంటాయని విమర్శించారు. బీజేపీ వాళ్లు తొమ్మిదేళ్లు బీఆర్ఎస్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగారని శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. అలాంటిది.. బీజేపీ నేతలు ఇప్పుడెందుకు బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు.