తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు. ఎందుకంటే ఆయనను దర్శించుకుని ఏం కోరుకున్నా సరే తప్పక నెరవేరుస్తాడు. అలాగే కలియుగంలోనూ ఆయన ఏడుకొండలు దిగి వచ్చి భక్తుల సమస్యలను తీర్చాడని పురాణాలు చెబుతున్నాయి. కనుకనే ఆయనను కలియుగ ప్రత్యక్ష దైవం అని అంటారు. ఇక మన పెద్దలు దేవుడిని ప్రత్యక్షంగా చూడాలంటే తిరుమల వెళ్లాలని చెబుతుంటారు. తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామిని చూస్తే ప్రత్యక్షంగా దేవుడిని చూసిన ఫీలింగ్ కలుగుతుందట.
ఇక వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం కలిగే ఆ భావనను వ్యక్తపరచలేం. తిరుమల స్వామిని దర్శించుకున్నాక మనసు కూడా ఎంతో ఉల్లాసంగా, ప్రశాంతంగా, పాజిటివ్ గా అనిపిస్తుంది. అందుకే కాబోలు తిరుమలకు జనాలు క్యూ కడుతుంటారు. అయితే కేవలం శ్రీవారిని దర్శించుకోవడానికే లక్షల మంది తిరుమలకు వెళ్తుంటారు. కానీ తిరుమల శ్రీవారి ఆలయం గురించి మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) అనే ఓ స్వతంత్ర సంస్థ నేతృత్వంలో తిరుమల ఆలయ నిర్వహణ కొనసాగుతుంది. టీటీడీలో దాదాపుగా 15వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. టీటీడీ కింద తిరుమల ఒక్కటే కాదు.. మొత్తం 12 ఆలయాలు ఉన్నాయి. 1830 సమయంలోనే తిరుమలలో భక్తులు చెల్లించే కానుకల నుంచి ఈస్టిండియా కంపెనీకి ఏడాదికి రూ.1 లక్ష దాకా పన్ను వచ్చేదట. తిరుమల గుడిలో దాదాపు 11 టన్నుల స్వర్ణాభరణాలు ఉన్నాయని తెలుస్తోది.
ఇక స్వామి వారికి వాడే 108 బంగారు పువ్వులను గుంటూరు జిల్లాకు చెందిన షేక్ హుస్సేన్ సాహెబ్ అనే ముస్లిం శ్రీవారికి సమర్పించాడు. తిరుమలలో శ్రీవారికి ప్రతి గురువారం నైవేద్య సమయంలో తిరుప్పావడ జరుగుతుంది. తిరుప్పావడ అంటే సుమారు 450 కిలోల అన్న ప్రసాదం, లడ్డు, వడ, దోశ, పాయసం, జిలేబీ తదితర పిండివంటలను శ్రీవారికి నైవేద్యంలా సమర్పిస్తారు. దీన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఇక 1983లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భక్తుల కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ను నిర్మించారు. దీని ద్వారానే నిత్యం వేల సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకుంటుంటారు. ఇలా తిరుమల ఆలయం ఎన్నో విశిష్టతలను కలిగి ఉంది.