Akunuri Murali : తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక చాలా మంది అధికారులు రాజీనామా చేస్తున్నారు. మరి కొందరు కేంద్ర సర్వీసులకి వెళుతున్నారు. అయితే ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను ఉద్దేశించి మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర సర్వీసులకు వెళ్లే ఐఏఎస్ అధికారులను పంపకుండా చర్యలు తీసుకోవాలని తన సోషల్ మీడియాలో తెలిపారు. ఇలాంటి అధికారులను కేంద్ర సర్వీసులకు వెళ్లకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆకునూరి మురళి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎంవోను ట్యాగ్ చేస్తూ ఎక్స్ (ట్విటర్)లో పోస్టు చేశారు.
ఏం తప్పులు చెయ్యకపోతే భుజాలు తడుముకోడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ‘దేశం మొత్తంలో హెలికాప్టర్‌లో వెళ్లి పనులను పర్యవేక్షించే ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ ఈమెగారు మాత్రమే’ అంటూ ఆకునూరి రాసుకొచ్చారు. అప్పటి ప్రభుత్వంలో చేసినవన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర ప్రభుత్వానికి వెళ్లి, అక్కడి నెట్‌వర్క్స్‌ను వాడుకొని, ఇక్కడి తప్పులను తప్పించుకోవడం కొంత మంది ఐఏఎస్ అధికారులకు ఫ్యాషన్ అయ్యింది అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆకునూరి ట్వీట్ ఇప్పుడు రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు కారణం అవుతోంది. దీనిపై రేవంత్ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
తాను కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతున్నానన్న వార్తలపై.. స్మిత సబర్వాల్ స్పందించారు. తానెక్కడికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఎటువంటి బాధ్యత అయిన స్వీకరిస్తానని స్పష్టం చేశారు. సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు. మంత్రి సీతక్కను స్మితా సభర్వాల్ కలిశారు. ఇక ఆకునూరు మురళి గురించి తెలంగాణ జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ హయాంలో ఐఏఎస్‌గా వాలెంటైర్ రిటైర్‌మెంట్ తీసుకొని.. బీఆర్ఎస్ సర్కార్ మీదే యుద్ధం ప్రకటించిన వ్యక్తి. ఆయన గత కొంతకాలంగా విద్యా, వైద్య రంగాలపై రాష్ట్రంలో అధ్యయనం చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తించి పేదలు, ఆదివాసీల మన్ననలు పొందారు. కేసీఆర్ ప్రభుత్వంలో అణిచివేతలకు గురయ్యానని ఆరోపిస్తూ స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేశారు.