Pawan Kalyan : ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలలో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికలలో గెలిచి తీరాలని పవన్ కళ్యాణ్ కసరత్తులు చేస్తున్నాడు. అయితే 2023 సంవత్సరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏమాత్రం కలిసి రాలేదు. 2023 సంవత్సరంలో కూడా జనసేన రాజకీయాలలో తన ప్రభావాన్ని చూపించలేక పోయిందని తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల ద్వారా అర్థమవుతుంది. ఈ ఏడాది దూకుడుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిన జనసేన ఏపీలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టిడిపితో పొత్తు పెట్టుకుంది. మరి వీరు ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.
అయితే పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన సభలో ముఖ్యమంత్రి పదవి మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ వెనుక తాను నడవడం లేదన్న పవన్ కళ్యాణ్.. తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తున్నానని అన్నారు. అధికారం కోసం తాను ఓట్లు అడగడం లేదన్న జనసేనాని.. మార్పు కోసం తమను ఆశీర్వదించాలని కోరారు. రాష్ట్రానికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే 2014లో టీడీపీ, బీజేపీకి మద్దతిచ్చినట్లు పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తూ 2019లో కుదరలేదన్న జనసేనాని.. 2024లో ఏపీ భవిష్యత్తు కోసమే మరోసారి కలిసివస్తున్నట్లు చెప్పారు. సీఎం పోస్టు గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… జనసేన నిలబడిన స్థానాల్లో గెలిచి, మద్దతిచ్చిన స్థానాల్లో అభ్యర్థులను గెలిపిస్తే జనసేన బలం ఏంటో అందరికీ తెలుస్తుందని పవన్ అభిప్రాయపడ్డారు.
అప్పుడు సీఎం పదవిని అడగగలమని కార్యకర్తలతో చెప్పిన పవన్.. ముఖ్యమంత్రి పదవి గురించి చంద్రబాబు, తాను చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. జీవితంలో ఇప్పటికే ఎన్నో ఓటములు ఎదుర్కొన్నానన్న పవన్ కళ్యాణ్.. తాను బతికి ఉన్నంతవరకూ జనసేన పార్టీని మరో పార్టీలో విలీనం చేయనని స్పష్టం చేశారు. ప్రజారాజ్యంలా జనసేన మారబోదన్న జనసేనాని.. మీ అభిమానం ఓట్లుగా మారాలని కార్యకర్తలను కోరారు.