Harish Rao : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అర్ధరాత్రి కాలుజారి బాత్రూంలో పడిపోయిన విషయం తెలిసిందే. అయితే కేసీఆర్ని కుటుంబ సభ్యులు సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో కేసీఆర్ను చేర్పించారు. మరోవైపు, మాజీ సీఎం కేసీఆర్ గాయపడిన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రి వద్ద భద్రత పెంచాలని అధికారులను ఆదేశించారు. ఆయనకు మెరుగైన వైద్యం అందజేయాలని సూచించారు. కేసీఆర్ ఆరోగ్యంపై హైదరాబాద్లోని యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. బాత్రూమ్లో జారిపడటంతో ఆయనకు గాయమైందని పేర్కొన్నారు. సీటీ స్కాన్ సహా పలు పరీక్షలు నిర్వహించామని, ఆయన ఎడమ తుంటికి గాయమైందని, హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయాల్సి ఉందన్నారు.
శస్త్ర చికిత్స తర్వాత మాజీ సీఎం కోలుకోడానికి 6-8 వారాలు పడుతుందని హెల్త్ బులిటెన్లో తెలియజేశారు. ఆర్ధోపెడీషియన్, అనెస్థీషియా, జనరల్ మెడిసిన్, పెయిన్ మెడిసిన్ సహా బహుళ విభాగాలకు చెందిన వైద్యుల బృందం కేసీఆర్ ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తోందని చెప్పారు. కేసీఆర్కు గాయం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని.. ఆయన పూర్తి ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. మరోవైపు, తన తండ్రి కేసీఆర్ ఆరోగ్యంపై ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత సామాజిక మాధ్యమం ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేసీఆర్కు స్వల్ప గాయమైందని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. ‘ఆయన త్వరలోనే కోలుకుంటారని. కేసీఆర్పై ప్రజల ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’ కవిత ట్వీట్ చేశారు.
ఇక హరీష్రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ని పరామర్శించేందుకు ఎవరూ హాస్పిటల్ రావొద్దని అభిమానులకు ఎమ్మెల్యే హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని అభిమానులు ఆందోళన చెందవద్దన్నారు. కాగా, కేసీఆర్ను పరిశీలించిన వైద్యులు తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. దీంతో ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం కేసీఆర్కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయనున్నారు. కేసీఆర్ కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందని హరీశ్ రావు తెలిపారు.