Pawan Kalyan : తెలంగాణలో నవంబర్ 30న ఎలక్షన్స్ జరగనుండగా, ఈ ఎన్నికలలో ఎవరు గెలుస్తారనే చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తుంది. కాంగ్రెస్,బీర్ఎస్, బీజేపీతో పాటు ఇతర పార్టీలు కూడా జోరుగా ప్రచారాలు చేశారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు పవన్. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా పవన్ వ్యాఖ్యానించారు. కూకట్ పల్లి నియోజకవర్గ బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి ప్రేమ్ కుమార్‌కు మద్దతుగా ప్రచారంలో భాగంగా బాలానగర్ నుంచి హస్మత్ పేట అంబేద్కర్ విగ్రహం వరకు పవన్ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే యువత ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారు కానీ.. వారి ఆశలు నెరవేరలేదన్నారు పవన్. ఉత్తరాంధ్రకు చెందిన 26 వెనుకబడిన కులాలను బీసీ జాబితా నుంచి తీసేశారని.. బీజేపీ-జనసేన అధికారంలోకి రాగానే 26 కులాలకు న్యాయం చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. పేరుకే ఉత్తరాంధ్ర వాసులైనా తెలంగాణను మాతృభూమిగా చేసుకుని జీవిస్తున్నారని పవన్ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని కేంద్రంలోని పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. జనసేన ఆవిర్భావం తెలంగాణలోనే జరిగిందని.. తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నామని ఆయన తెలిపారు.
జనసేనకు మద్దతు తెలిపేందుకు సభకు వచ్చిన టీడీపీ కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి ప్రేమ్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పవన్ కళ్యాణ్ ఓటర్లను కోరారు. తెలంగాణలో బీజేపీ-జనసేన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. అయితే తెలంగాణలో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవని, ఆ ప్రభావం ఏపీపై కూడా పడుతుందనే ఉద్దేశంతో టీడీపీ పోటీకి దూరంగా ఉంది. కానీ పవన్ కల్యాణ్ మాత్రం పోటీకి సై అన్నారు. అభ్యర్థుల్ని ప్రకటించి, చివరకు బీజేపీ ఇచ్చిన లిస్ట్ తో సర్దుకున్నారు. మరి జనసేన ప్రభావం తెలంగాణ ఎన్నికలలో ఎంతమేర ఉంటుందనేది చూడాలి.