Pawan Kalyan:నాలుగో విడత వారాహి యాత్ర పవన్ కళ్యాణ్ చేపట్టిన విషయం తెలిసిందే. కృష్ణాజిల్లా… అవనిగడ్డ నుంచి ఈ యాత్ర ప్రారంభం కాగా, గత 3 వారాహి యాత్రలు వేరు.. నిన్న చేపట్టిన 4వ విడత వేరు. అప్పటి రాజకీయ పరిస్థితులు వేరు, ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితులు వేరు. అప్పుడు జనసేన ఒంటరిగా ఉంది, ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకొని ఉంది. అప్పుడు వారాహి సభకు జనసేన కార్యకర్తలే వచ్చారు, ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు కూడా వచ్చారు. అప్పట్లో చంద్రబాబు బయట ఉండగా, ఇప్పుడ జైల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ జనసేనాని చేపట్టిన వారాహి యాత్రపై అందరిలో ఎంతో ఆసక్తి నెలకొంది. ఆయన ఎలాంటి డైలాగులు పేలుస్తారా అని ప్రతి ఒక్కరు ఆశగా ఎదురు చూశారు.
ఈ క్రమంలో తనకి డబ్బు మీద గానీ, భూమి మీద గానీ తనకు ఎప్పుడూ కోరిక లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్యాకేజీ స్టార్ అంటూ తనను విమర్శిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలపై మండిపడ్డారు. ‘జగన్ అద్భుతమైన పాలకుడైతే నాకు రోడ్డుపైకి వచ్చే అవసరమే లేదు. నా నైతిక బలంతోనే ఎంతో బలమైన జగన్‌తో గొడవ పెట్టుకున్నా. ఈ పదేళ్లలో మా పార్టీ అనేక దెబ్బలు తింది. ఆశయాలు, విలువల కోసం పార్టీ నడుపుతున్నాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం, మీ అందరి భవిష్యత్తు కోసమే నా తపన అంతా. నా పోరాటం సీఎం పదవి కోసం కాదు’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌ను పట్టి పీడిస్తున్న వైసీపీ మహమ్మారికి.. జనసేన – టీడీపీ వ్యాక్సినే మందు. మనల్ని కులాలుగా వేరు చేస్తున్నారు. కులం కంటే మానవత్వం గొప్పది. నేనెప్పుడూ ఎవరిలో కులం చూడలేదు, గుణమే చూశా. నేను ప్రతి ఒక్కరిలో గుణం, ప్రతిభ, సామర్థ్యం మాత్రమే చూస్తా..’ అని పవన్ అన్నారు.
ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమేనంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘కురుక్షేత్ర యుద్ధంలో మేం పాండవులం, మీరు కౌరవులు’ అని పవన్ అన్నారు. ‘జగన్ ముద్దూ మురిపాలతో పదేళ్లు జనంలో తిరిగారు. జగన్‌ను దేవుడని మొక్కితే, ఆయన దెయ్యమై ప్రజలను పీడిస్తున్నారు’ అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు.ఆయనని నమ్ముకొని వైసీపీ నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయన ఏదో చేస్తాడని మీరు ఎగురుతున్నారు. కాని మీ అందరికి జనసేననే దిక్కు. నాకు మానవత్వం ఉంది కాబట్టి కాస్త అయిన కనికరిస్తాను. మీరు మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది అంటూ పవన్ సూచనలు చేశారు.