Chandrababu : వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఎంత పెద్ద వివాదాస్పదం అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీ ప్రభుత్వంపై పరోక్షంగా సెటైర్లు పేల్చిన చిరంజీవి.. ఎంతసేపు సినిమా ఇండస్ట్రీ గురించి కాదు.. ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, పేదవారికి కడుపు నింపేలా, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి ఆలోచిస్తే మంచిదన్నారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు పడతారన్నారు. చిరంజీవి వ్యాఖ్యలకి వైసీపీ నాయకులు ఫుల్ ఫైర్ అయ్యారు. కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు విమర్శల వర్షం కురిపించారు. అయితే ఇప్పుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి.
ఈ క్రమంలో చంద్రబాబు దీనిపై స్పందించారు. అన్నమయ్య జిల్లా అంగళ్లులో దాడి ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేశారు. టీడీపీ చంద్రబాబు సహా మరో 20 మంది టీడీపీ నేతలపై పోలీసులు హత్యాయత్నం కేసులు కూడా పెట్టారు. పోలీసులు తనపై హత్యాయత్నం కేసు పెట్టడంపై చంద్రబాబు స్పందించారు. తనపై హత్యాయత్నం చేసి, తిరిగి తనపైనే హత్యాయత్నం కేసు పెట్టారని మండిపడ్డారు. సీఎం ఆదేశాలతో అంగళ్లులో వైసీపీ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారన్నారు. అంగళ్లులో తనపై దాడి చేస్తారని పోలీసులకు ముందస్తు సమాచారం ఉందని అన్నారు. తనను హత్య చేసేందుకు వైసీపీ గూండాలు అంగళ్లు వచ్చారని ఆరోపించారు.
రాష్ట్రంలో అందరిపైనా కేసులు పెట్టారని, మీడియాకు, రాజకీయ నాయకులకు రక్షణ లేదని చంద్రబాబు ఆరోపించారు. చిరంజీవి చిన్న మాట అంటే ఎదురుదాడి చేస్తున్నారని, అధికారమనే పిచ్చిరాయి చేతిలో పెట్టుకుని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇంత ఘోరంగా వ్యవహరించి తనపైనే కేసు పెట్టారని, పోలీస్ అధికారులను వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారన్నారు. తనపైనే హత్యాయత్నం చేసి హత్యాయత్నం కేసు పెట్టారన్నారు. తనపై జరిగిన దాడి ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాజ్యాంగ పెద్దలకు లేఖలు రాస్తానని తెలిపారు. దోషులను ప్రజాక్షేత్రంలో నిలబెట్టే వరకు వదిలిపెట్టనని చెప్పారు.