Pawan Kalyan : గత కొద్ది రోజులుగా వారాహి యాత్రలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. జగన్‌తో పాటు ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. రెండో విడత వారాహి యాత్ర శుక్రవారం నాడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగింది. ఈ సందర్భంగా సభ ప్రారంభం కాగానే.. జనసేన నేత విడివాడ రామచంద్రరావుకు క్షమాపణలు చెప్పారు. ‘ క్షమాపణలతో సభ ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. ఆ క్షమాపణలు ఎవరికంటే విడివాడ రామచంద్రరావుగారికి. ఆయన ఎంత బలమైన నాయకుడు అంటే నిన్న వీర మహిళలు, జనసేన కార్యకర్తల సభలో చెబితే నాకు సరిపోలేదు. అందుకే తణుకులో పబ్లిక్‌గా క్షమాపణలు చెప్పుకుంటున్నాను అని అన్నారు.
నేను టికెట్ ఇచ్చిన వ్యక్తి పార్టీ నుంచి వెళ్లిపోయారు. సీటు ఇవ్వని రామచంద్రరావు గారు పార్టీ కోసమే నిలబడ్డారు. ఇలాంటి వ్యక్తికి ధన్యవాదాలు చెబుతూ అందరి ముందు క్షమాపణలు కోరుతున్నాను’ అని సభని క్షమాపణలతోనే ప్రారంభించారు పవన్.ఆ తర్వాత జగన్ సర్కార్‌పై తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలతో సేనాని విరుచుకుపడ్డారు. 1100 కోట్ల విపత్తు నిధులను ఇతర పద్దులకు మళ్లించావు. సుప్రీంకోర్టు బయటపెడితేనే ఆ విషయం బయటపడింది. నువ్వు.. ప్రజల డబ్బు దొంగతనం చేస్తున్నావు.. అందుకే జగ్గూ భాయ్ అంటున్నాను. నీకు గళ్ల లుంగీ, పచ్చ చొక్కా వెయ్యాలి జగన్ అంటూ మండిపడ్డారు పవన్ కళ్యాణ్.
జగన్ అనుచరులు ఆయనను జగ్గూ భాయ్ అంటుంటే బాధపడిపోతున్నారు. నన్ను దత్తపుత్రుడుని, ప్యాకేజీ స్టార్ అని, పవన్ అని జగన్ అంటున్నాడు. అందుకే ఆయన్ను జగ్గూ భాయ్ అంటున్నాను. గిట్టుబాటు ధర రాలేదనే రైతులను ఎర్రిపప్ప అని వైసీపీ నాయకులు అంటున్నారు. మీరు ఏమైనా అనొచ్చు.. మేము అంటే తప్పా..? జగన్ గారు నుంచి జగ్గూ భాయ్ అనే స్థితికి జగన్ వచ్చాడు. ఇంకా నా మీద నోరు జారితే జగ్గూ అంటాను.. ఇంకా నోరు జారితే జగన్‌ను ఏమంటానో నాకు తెలీదు. మొలకలు వచ్చాయన్న రైతులను ఇక్కడ మంత్రి ఎర్రిపప్ప అంటాడు. ఎర్రిపప్ఫ అంటే అర్ధం ఏమిటంటే బుజ్జి కన్నా అంటాడు. ఎవడు నువ్వు అసలు. అన్నింటికి ట్యాక్స్ లు కట్టాలా అంటూ కోపంతో ఊగిపోయారు పవన్.